Headlines News :
Home » » వృద్ధి సాధనలో ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్

వృద్ధి సాధనలో ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్

విజయవాడ, మేజర్‌న్యూస్: కృష్ణా పుష్కరాలలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కమాండ్, కమ్యూనికేషన్ సెంటర్‌గా మారుస్తూ జిల్లాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమాండ్ కమ్యూ నికేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం విజయవాడలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో కూడా కమాండ్, కమ్యూనికేషన్స్ సెంటర్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సెంటర్‌లు అత్యవసర, సంక్షోభ సమయాల్లో మాత్రమే కాకుండా రియల్ టైమ్ గవర్నెన్స్‌కు నిలువుటద్దంగా ఉపయోగపడతాయన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు కనీస పరికరాలు, మానవ వనరు లను ప్రతి గ్రామంలో సిద్ధంగా ఉంచుతామని ముఖ్య మంత్రి చెప్పారు. 

కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇకపై సీఎంవోలో భాగం, దీనికి ముఖ్యమంత్రి చీఫ్ కమాండర్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. విభజన తరువాత రాష్ట్రానికి చాలా సవాళ్లను ఎదురయ్యాయని.. కేవలం కష్టం, శ్రమతో సవాళ్లను ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక విభాగం రూపొందించిన 3 పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ఏడాది త్రైమాసిక ఫలితాలు సమీక్షించుకుంటూ వృద్ధి సాధనలో ఆంధ్రప్రదేశ్ ముందుడుగు వేస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలో భారతదేశం వృద్ధిరేటు 7.31 శాతం కాగా, ఏపీ వృద్ధిరేటు 12.26 శాతం సాధించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాలనలో తొలి ప్రాధాన్యం జల వనరులకు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. జల భద్రత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని.. మొదటి భూగర్భజలాలను కాపాడుకుంటున్నట్లు వెల్లడించారు. రెండో ప్రయత్నంగా నదుల అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా జల వనరులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడికక్కడ స్థానికంగా స్మాల్ గ్రిడ్లతో స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది భూగర్భ జలాల పలితాలు సంతృప్తి నిచ్చాయన్నారు. 9.7 అడుగులకు భూగర్భజలాలు రావడం ఆనందదాయకమన్నారు. ఎప్పుడూ కరువు ఉండే రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకున్నట్లు తెలిపారు. మెట్ల పైర్లు దెబ్బతినే పరిస్థితిలో తక్షణం రైన్ గన్ ద్వారా తడులు అందించినట్లు తెలియజేశారు. కేవలం ఆరు రోజుల్లోనే నాలుగు లక్షల ఎకరాలకు తడులు అందించినట్లు తెలిపారు. 

కరువుపై యుద్ధంలో పాల్గొన్న అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీరు సమృద్ధిగా నీరందుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నిధులు ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. దీంతో ప్రాజెక్టుకు నిధుల కొరతలేదని, సమయంలోగా పనులు పూర్తి చేసేందుకు కార్యచరణ చేపట్టడమే ముందున్న లక్ష్యమని చంద్రబాబు వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధ్యపడుతుందన్నారు. ప్రపంచానికి సముద్ర ఆహారోత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఆక్వా కల్చర్‌లో ఉహించని వృద్ధి రేటు వస్తుందని చెప్పారు. సంక్షేమ ఫలాలు సామాన్యుడికి చేరడంలో నూరు శాతం సంతృప్తి సాధించాలన్నారు. సమాజంలో ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. అగ్రవర్ణ పేదలకు కూడా స్కాలర్ షిప్‌లు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆహార భద్రతలో భాగంగా ప్రతి పేదవాడికి బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఇ-పోస్ విధానం అమలు చేస్తున్నా ప్రజా పంపిణీలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే వెంటనే వాటిని అరికట్టే బాధ్యత కలెక్టర్లే చూసుకోవాలన్నారు. ప్రతి పేద కుటుంఆనికి రూ.10వేల ఆదాయం అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. 

2018 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడీఎఫ్ గ్రామాలుగా మారాలని సీఎం స్పష్టం చేశారు. దోమలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నారు. ప్రజలు సంతృప్తిగా జీవించాలంటే సమస్యలు లేకుండా చూడాలన్నారు. వివిధ స్థాయిల్లో అధికారుల పనితీరు మెరుగు పరుస్తున్నామని స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నాటికి ప్రజా సాధికార సర్వే పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రగతి వైపు పయనిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అనేక రంగాలలో మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ఫలితాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉందన్నారు. 

వృద్ధి రేటులో వ్యవసాయ రంగం కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు పాల్గొన్నారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com