Headlines News :
Home » » బాబు ఎంత దుర్మార్గపు సీఎం అంటే..

బాబు ఎంత దుర్మార్గపు సీఎం అంటే..

ఏపీ విపక్ష నేత నోట వస్తున్న మాటలు బుల్లెట్ల మాదిరి దూసుకెళుతున్నాయి. ఏపీ అధికారపక్షంపైనా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపైనా ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఆయన మాటలో కరుకుదనం పాళ్లు రెట్టింపు కావటమే కాదు.. మాటల్ని తూటాల్లా పేలుస్తున్నారు. ఓపక్క ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో పోరుబాట పట్టిన జగన్.. తాజాగా కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యల తీవ్రత గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బాబు సర్కారు తప్పుల్ని వివరించే క్రమంలో.. నిప్పు కణికల్లాంటి మాట్లాల్ని ఆయన ప్రయోగిస్తున్నారు. వాస్తవాల్ని ప్రస్తావిస్తూ.. బాబు పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్న వైనం పలువురి దృష్టిని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ఎన్నికల్లో చెప్పిన రీతిలో రుణమాఫీ చేయని బాబు సర్కారు కారణంగా రుణాల రీషెడ్యూల్ లేకుండా పోయిందని.. దీంతో కొత్తగా రుణాలు ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. ఈ అంశాన్ని తనదైన మాటల్లో చెబుతున్న జగన్.. ‘‘బుద్దున్నోడు ఎవడైనా రైతులకు తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు చెబుతాడు. కానీ.. రైతులకు రుణాలు ఇవ్వొద్దని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. వ్యవసాయ పెట్టుబడుల కోసం భార్యల తాళిబొట్లను తాకట్టు పెట్టాల్సిన దీన స్థితి రైతులది. కానీ.. వారి కష్టాలు పట్టించుకోకుండా.. బంగారం కుదవపెట్టుకొని రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే’’ అంటూ ఫైర్ అయ్యారు.

వర్షాల కారణంగా గడిచిన ఆరు రోజులుగా గ్రామాలు నీళ్లలో నిండినా.. గ్రామాల్లోకి రాకుండా.. హెలికాఫ్టర్లో వచ్చి వెళ్లటం బాబుకే సరిపోయిందంటూ మండిపడ్డ జగన్.. ‘‘ప్రభుత్వంలో ఉన్న వారు సిగ్గు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి తమ గ్రామానికి హెలికాఫ్టర్ లో వచ్చాడు కాబట్టి ఆయన్ను కలుసుకొని కష్టాలు చెప్పుకోవాలని అనుకున్న గ్రామస్తులను కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు. భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా దెబ్బ తిన్నారు. ఇలాంటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా రైతులకు సాయం చేస్తారు. కానీ చంద్రబాబు ఎలాంటి సహాయమూ చేయటం లేదు. గత సంవత్సరానికి సంబంధించిన ఇన్ ఫుట్ సబ్సిడీ కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు’’ అని ఫైర్ అయ్యారు.

బాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన జగన్.. ఆయనపై వ్యక్తిగత విమర్శల్ని మరింతగా పెంచేశారు. ‘‘బంగారం పెట్టుకొని రైతులకు రుణాలు ఇవ్వొద్దని చెబుతారు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా ఉండరు. బాబు నోరు తెరిస్తే అబద్ధాలు. ఆయనకు తెలిసింది ఏమిటంటే పనయ్యాక కత్తి తీసుకొని మెత్తగా పొడవటం. పిల్లనిచ్చిన సొంత మామను పొడుస్తాడు. ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కూడా పొడుస్తాడు. ఇలాంటి దారుణమైన వ్యక్తి దేశంలో ఎక్కడా లేడు’’ అని అన్నారు. తాను పరామర్శకు వచ్చిన కార్యక్రమానికి పబ్లిసిటీ వస్తే.. బాబులో కదలిక వస్తుందని ఆశిస్తున్నానని.. తన వైఖరి ప్రజలకు తెలుస్తుందని సిగ్గుపడైనా మేలు చేస్తారనే తాను పరామర్శల కార్యక్రమానికి వచ్చినట్లుగా జగన్ పేర్కొన్నారు. ఏమైనా.. గడిచిన కొద్ది రోజుల్లో బాబుపై మాటల దాడి తీవ్రతను జగన్ బాగా పెంచేసిన అభిప్రాయం వ్యక్తమవుతోంది.tupaki.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com