Headlines News :
Home » » మళ్లీ ఈ పీహెచ్ డీ లొల్లేంది.. చంద్రన్నా!

మళ్లీ ఈ పీహెచ్ డీ లొల్లేంది.. చంద్రన్నా!

సీఎం హోదాలోని మనిషి మాటలను సీరియస్ గా తీసుకోవాలా.. లేక ఆయన ఏదో గాలి కబుర్లు చెబుతుంటాడు, అని  పూర్తిగా విస్మరించాలా? మిగతా సీఎంల సంగతేమో కానీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో రకంగా తెలుగు ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాడు. ఆయన మాట్లాడే మాటలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. 
ప్రతిపక్షాలకు ఇట్టే దొరికిపోయేలా.. సాధారణ ప్రజానీకానికి అంతుబట్టని విధంగా.. తప్పుడు సమాచారాలతో కూడుకున్న మాటలు వినిపిస్తున్నాయి చంద్రబాబు నుంచి. “హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నేనే పెట్టా..’’ అనే మాటను తరచూ చెబుతుంటారాయన. “హైదరాబాద్ ను నేనే కట్టా..’’ అనేది కూడా అలాంటి మాటే! ఆ నగర అభివృద్ధిలో తన కృషి ఉందని చెప్పుకోవచ్చు అంతే కానీ.. ఏదో తాపీ మేస్త్రీలా “నేనే కట్టా..’’ అని ప్రకటించుకొంటూ పోతున్నారు చంద్రబాబు.
అది కూడా నాలుగువందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక నగరాన్ని తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి “నేనే కట్టా..’’ అని ప్రకటించుకోవడానికి మించిన హాస్యాస్పదమైన విషయం ఉండదు. వినేవాళ్లు నవ్వుతున్నారు.. అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా బాబుగారు తన ప్రహసనాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల గురించి, ఆయన తండ్రి గురించి చంద్రన్న చేసిన వ్యాఖ్యానాలు ప్రతిపక్షాలకే అస్త్రాలుగా మరాయి. తన మాటలు వినే సత్య నాదెళ్ల ఐటీ చదువులు చదివాడని, నా కృషితోనే మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎదిగాడని బాబు చెప్పుకోవడం మరో ప్రహసనం. బాబు సీఎం అయ్యే సరికే.. దేశం దాటి వెళ్లిపోయిన సత్యనాదెళ్ల గురించి ఇప్పుడు ఇలా ప్రకటించుకోవడంలో ఏ మాత్రం లాజిక్ లేకపోవడంతో ప్రతిపక్షాలు ఉతికి ఆరేశాయి.
ఇక ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రమ్మన్నది నేనే.. అంటూ మరో బాంబు పేల్చాడు చంద్రబాబు. దీంతో నివ్వెరపోయారంతా! ‘అధిష్టానం ఆదేశిస్తే.. మామపైపోటీకి సై’ అంటూ ఈయన ఆనాడు చేసిన ప్రకటనను, అది ఆ రోజుల్లో పత్రికల్లో పతాకశీర్షికల్లో అచ్చయిన విధానాన్ని నెటిజన్లు ప్రస్తావనలోకి తీసుకొచ్చి.. బాబుగారి గాలి తీశారు!
ఇక దేశంలో నేనే నంబర్ వన్ సీఎం, అందరి కన్నా నేనే తెలివైన వాడిని.. అనే ప్రకటనలు కూడా బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ నే విస్మయానికి గురి చేశాయి. తెలివైన వాడు ఎవడూ.. “నేను తెలివైన వాడిని..’’ అని ప్రకటించుకోడు. “నాకు ఇంగ్లిష్ రాదంటారా.. నాకు ఇంగ్లిష్ వచ్చు..’’ అని చంద్రబాబు తెలుగులో ప్రకటించుకోవడం కూడా పత్రికల్లో పతాకశీర్షికల్లో ఎక్కింది.
ఇంతకు ముందు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తులు ఎవరూ ఇలాంటి సొంత డబ్బా కొట్టుకుని నవ్వుల పాలు అయిన దాఖలాలు లేవు. మహా అయితే ..’మేం అభివృద్ధి చేశాం..’ అనే చెప్పుకున్నారంతా. కానీ ‘అంతా నేనే.. అన్నీ నేనే..’’ అనలేదు.
ఈ సంగతులిలా ఉంటే.. ఏపీ సీఎం చంద్రబాబు తను పీహెచ్ డీ చేశాను అని ప్రకటించుకోవడం కొత్త గందరగోళానికి తావిస్తోంది. నాకు ఇంగ్లిష్ వచ్చు.. నేను పీహెచ్ డీ చేశాను.. అని బాబు చెప్పుకున్నారు! అయితే రాజకీయ నేతల, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారి విద్యార్హత అంశం  తీవ్రమైనదే. ఈ విషయంలో తప్పుడు సమాచారాలతో కేంద్ర మంత్రులే ఇబ్బంది పడుతున్నారు.
ఈ తరుణంలో బాబుగారు తను పీహెచ్ డీ చేశాను అని చెప్పుకోవడం వివాదాస్పదమైన అంశమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో.. సీఎం ప్రొఫైల్ ను గమనిస్తే.. అందులో ఆయన  పీహెచ్ డీ చదవినట్టుగా లేదు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో బాబు  ఎంఏ ఎకనామిక్స్ చదివినట్టుగా ఆ వెబ్ సైట్లో ఉంచారు. మరి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లో.. సీఎం కనుసన్నల్లోని సైట్లో ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదివారని పెట్టడం ఏమిటి? బాబుగారు ఇలా పీహెచ్ డీ చేశానని ప్రకటించుకోవడం ఏమిటి? ఇందులో ఏది నిజం ఏది అబద్ధం? 
ఎన్నికల ఆఫిడవిట్ లో ఆస్తుల ప్రకటన ఎంత ముఖ్యమైన అంశమో… విద్యార్హత కూడా కీలకమైన అంశం అని బాబు లాంటిరాజకీయ మేధావికి తెలియనిదా? ఒకవేళ పీహెచ్ డీ చదవడం అనేది.. ఉత్తుత్తి మాటేనా? ఆ చదువు చదివి ఉంటే.. అది ఎప్పుడు, ఎక్కడ పూర్తి అయ్యిందో.. ఎందుకు వెబ్ సైట్లో లేదు? సీఎం స్థాయి మనిషి తన విద్యార్హత విషయంలో ఇలా మాట్లాడవచ్చా? http://telugu.greatandhra.com/
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com