Headlines News :
Home » » అసెంబ్లీ సీట్లు పెరుగుతాయ్‌!

అసెంబ్లీ సీట్లు పెరుగుతాయ్‌!

విభజన చట్టంలో పేర్కొన్న మాదిరిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ జరుగుతుందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లు సమాచారం. సోమవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో టీటీడీపీ నేతలతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ‘రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచవచ్చని కేంద్రం తెలిపింది. లోక్‌సభ సీట్లు యథాతథంగా ఉంటాయి. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఒకో లోక్‌సభ స్థానంలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. డీ లిమిటేషన్‌ ఖాయం’ అని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న జిల్లాలు ఈడీ లిమిటేషన్‌పై ప్రభావం చూపుతాయా అన్నది చర్చకు వచ్చింది. ఎస్సీ రిజర్వుడు సీట్లను జిల్లా యూనిట్‌గా చేయాల్సి ఉంటుందని, కొత్తజిల్లాలు వస్తున్నప్పుడు వాటిని ఎలా పరిగణలోకి తీసుకొంటారని కొందరు నాయకులు అడిగారు. ‘పాలన అవసరాలకోసం జిల్లాల ఏర్పాటు జరుగుతుంది. అదొక్కటే ప్రాతిపదిక కాదు. ఎన్నికల కమిషన్‌ వద్ద మొత్తం సమాచారం ఉంటుంది.

ఈసీ నిర్ణయమే ఫైనల్‌. అందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదు’ అని ఆయన వారికి చెప్పారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి.. అవసరమైన చోట ఒత్తిడి పెంచడానికి ప్రతిపక్షంగా పనిచేయాలని, కొత్త జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ‘మీరు ఏ టెక్నాలజీ ఉపయోగించినా.. జనంలోకి వెళ్ళి పనిచేయకుంటే ఫలితం ఉండదు. నిత్యం ప్రజల్లో ఉండాలి. వారి సమస్యలను అందిపుచ్చుకొని పనిచేయాలి. వారికోసం మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రజలకు విశ్వాసం కలగాలి. అదే సమయంలో పార్టీ నేతల మధ్య ఐకమత్యం అవసరం. ప్రతిదానికి నా కోసం ఎదురు చూడవద్దు. మీ కాళ్ళపై మీరు నిలబడి పనిచేయండి. మీ సామర్ధ్యంపైనే మీరు ప్రజల్లో నమ్మకం కలిగించాలి’ అని ఆయన సూటిగా చెప్పేశారు. ఇటీవల చేపట్టిన కార్యక్రమాల గురించి వారు వివరించినప్పుడు ఆయన అభినందించారు. దసరా తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించుకొంటామని వారు చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న జిల్లాల్లో టీడీపీ కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు.




andhrajyothy.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com