Headlines News :
Home » » సంక్రాంతి పోటీలో చిరుపై బాలయ్యదే పైచేయి!

సంక్రాంతి పోటీలో చిరుపై బాలయ్యదే పైచేయి!

సంక్రాంతికి పెద్ద హీరోల చిత్రాలు సందడి చేయడం జనానికి మహదానందం కలిగిస్తుంది. రాబోయే సంక్రాంతి తెలుగువారికి మరింత ఆనందం పంచబోతోంది. ఎందుకంటే ఈ సారి టాప్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ చాలా రోజుల తరువాత ఈ బరిలో ఢీ కొనబోతున్నారు.

తెలుగునాట ఎందరు స్టార్స్ వెలుగులోకి వచ్చినా, అసలు పోటాపోటీ సాగింది యన్టీఆర్, ఏయన్నార్ మధ్యే. ముఖ్యంగా సంక్రాంతి బరిలో వారిద్దరి చిత్రాలు ఢీ కొన్నతీరును జనం ఈ నాటికీ గుర్తుంచుకున్నారు. ఆ తరువాత ఆ తీరున సందడి చేసిన పోటీ బాలకృష్ణ, చిరంజీవి మధ్యే సాగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు మాస్‌ను మెప్పిస్తూ సాగిన తీరుతోనే తెలుగు చిత్రసీమ పాతికేళ్ళు వెలిగింది. అందుకే పోటీ అంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకేసారి వస్తేనే మజా అంటూ ఉంటారు ఈ నాటికీ సినీఫ్యాన్స్. మళ్ళీ అలాంటి రసవత్తరమైన పోటీ సంక్రాంతికి నెలకొనబోతోంది. బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి', చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150' సంక్రాంతికి సందడి చేయనున్నాయి.

సంక్రాంతి బరిలో చిరంజీవి- బాలకృష్ణ మధ్య తొలిసారి పోటీ 1987లో చోటు చేసుకుంది. ఆ యేడాది చిరంజీవి 'దొంగమొగుడు'తో బాలకృష్ణ 'భార్గవరాముడు' ఢీ కొంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరిది పైచేయిగా సాగింది. అయితే మొత్తం వసూళ్ళ పరంగా చిరంజీవి 'దొంగమొగుడు'దే పైచేయిగా నిలచింది. తరువాత ఏడాది చిరంజీవి 'మంచిదొంగ'తో బాలకృష్ణ 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్' పోటీ పడింది. ఈ రెండు చిత్రాలు కూడా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరిది పైచేయిగా సాగాయి. తరువాత 1997 సంక్రాంతి బరిలో చిరంజీవి 'హిట్లర్', బాలకృష్ణ 'పెద్దన్నయ్య' పోటీ పడగా రెండూ వసూళ్ళ వర్షం కురిపించాయి. వసూళ్ళ మొత్తంలో 'పెద్దన్నయ్య' కాస్త మెరుగనిపించింది.

చిరంజీవి 'స్నేహం కోసం', బాలకృష్ణ 'సమరసింహారెడ్డి' చిత్రాలు 1999లో సంక్రాంతి సీజన్‌లోనే పోటీ పడినా, రెండు సినిమాలకు పన్నెండు రోజులు తేడా ఉంది. చిరంజీవి సినిమా జనవరి 1న వచ్చి, తొలి పన్నెండు రోజులు బాగానే వసూళ్ళు రాబట్టింది. అయితే జనవరి 13న వచ్చిన 'సమరసింహారెడ్డి' ఆ యేడాది బంపర్ హిట్‌గా నిలచేలా విజయం సాధించింది. 1999 సంక్రాంతి బరిలో బాలకృష్ణది పైచేయి కాగా, 2000 సంక్రాంతి సందడిలో బాలకృష్ణ 'వంశోద్ధారకుడు'పై చిరంజీవి 'అన్నయ్య' పై చేయి సాధించింది.

వీరిమధ్య అసలు సిసలు సంక్రాంతి పోటీ అన్నది 2001లోనే సాగింది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా చిరంజీవి 'మృగరాజు', బాలకృష్ణ 'నరసింహనాయుడు' ఒకే రోజున అంటే జనవరి 11న విడుదలయ్యాయి. బాలకృష్ణ 'నరసింహనాయుడు' ఆల్ టైమ్ హిట్‌గా నిలవగా, చిరంజీవి 'మృగరాజు' పరాజయాన్ని చవిచూసింది. ఆ తరువాత 2004లో బాలకృష్ణ 'లక్ష్మీనరసింహా', చిరంజీవి 'అంజి' సంక్రాంతికి తలపడ్డాయి. ఆ సారి కూడా బాలకృష్ణదే పైచేయి అయింది. ఆ తరువాత మళ్ళీ పదమూడేళ్ళకు అంటే 2017 సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు ఢీ కొనబోతున్నాయి. అందునా ఆ రెండు సినిమాలు వారిద్దరికీ ప్రతిష్ఠాత్మక చిత్రాలు కావడం విశేషం. బాలకృష్ణ చారిత్రక కథాంశంతో వస్తోంటే, చిరంజీవి రీమేక్‌పై ఆధారపడి వస్తున్నారు. మరి ఈ సారి సంక్రాంతి బరిలో ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.





andhrajyothy.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com