Headlines News :
Home » » ఏం సాధించారని సన్మానాలు..??

ఏం సాధించారని సన్మానాలు..??

రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు సన్మానాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఏదైనా గొప్ప విజయాలు సాధించినవారికే సన్మానాలు జరుగుతాయని, మరి రాష్ట్రానికి ద్రోహం చేసి 5 కోట్ల మంది ప్రజలను వంచించి, మోసం చేసినందుకు వెంకయ్యనాయుడికి సన్మానం చేశారా? అని బీజేపీ శ్రేణులను ఆయన ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమన చంద్రబాబు, వెంకయ్యల తీరుపై మండిపడ్డారు. 

ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో అటు వెంకయ్యనాయుడుకు, ఇటు చంద్రబాబునాయుడుకు తెలిసినా ఓటుకు–నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో ఆ కేసు నుంచి బయట పడేందుకు ప్రత్యేక హోదాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఓటుకు–నోటు కేసు నుంచి తప్పించి, ప్రత్యేక ఫ్యాకేజి పేరుతో చంద్రబాబుకు రూ.వేల కోట్లు దోచిపెట్టేందుకు వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలోని ఏ నియోజవర్గం నుంచి తాను గెలవకపోయినా ప్రత్యేక హోదా కోసం పోరాడానని వెంకయ్యనాయుడు చెప్పడం బాధాకరమన్నారు. వెంకయ్యకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేకపోయినా కానీ, చంద్రబాబు నుంచి ప్రయోజనం మాత్రం పుష్కలంగా ఉందన్నారు. వెంకయ్యనాయుడుకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కన్నా చంద్రబాబు శ్రేయస్సే మిన్న అని మండిపడ్డారు. ఆ నాడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెబితే అలా కాదు పదిహేనేళ్లు కల్పించాలంటూ సాక్షాత్తు తిరుపతి శ్రీవారి సన్నిధిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులు చెప్పారని గుర్తు చేశారు. 

అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అంటూ హేలనగా మాట్లాడుతూ ప్రత్యేక ఫ్యాకేజి కల్పిస్తామని చెప్పడం అంతకన్నా మరో వంచన లేదన్నారు. భోపాల్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడే విష వాయువు కన్నా వెంకయ్యనాయుడు, చంద్రబాబులు మాట్లాడే మాటలు విషపూరితమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అన్ని విధాల అభివద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రధానప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమ, పోరాటాలు చేస్తే అరెస్ట్‌లు చేయించి కేసులు పెడతారా? అని మండిపడ్డారు. రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు నియంతపాలన సాగిస్తూ ప్రత్యేక హోదాపై ఎవరైనా ఉద్యమాలు చేస్తే వారిపై పీడీయాక్ట్‌ కేసులు నమోదు చేయమని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాలను అణగతొక్కాలని చూస్తే రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రెండన్నరేళ్ల కాలంలో రాష్ట్రప్రజలకు చంద్రబాబు వల్ల ఒరిగిందేమి లేదన్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం ప్రతిఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దుద్దేల బాబు, ముద్రనారాయణ, బొమ్మగుంట రవి, పుల్లూరు అమరనా«ద్‌రెడ్డి, కట్టా గోపీయాదవ్, రాజేంద్ర, చెలికం కుసుమ, శ్యామల, గీతాయాదవ్, శారద, పుష్పలత పాల్గొన్నారు.


sakshi.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com