Headlines News :
Home » » కొత్త జిల్లాలపై సీఎం చర్చలు

కొత్త జిల్లాలపై సీఎం చర్చలు

కొత్త జిల్లాల కూర్పు దాదాపు పూర్తయ్యింది. జిల్లాల ఏర్పాటుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షుల చర్చించి జిల్లాల ఏర్పాటును ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై కొన్ని జిల్లాలలో టీఆర్‌ఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గద్వాల్‌, సిరిసిల్ల, జనగాం జిల్లాలను ఏర్పాటు చేయాలని అక్కడి టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రజలు చేస్తున్న ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అదే విధంగా కొన్ని రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుతో పాటు మండలాల ఏర్పాటు, జిల్లాలో మండలాల విలీనం, మండలాలలో గ్రామాల విలీనంపై ప్రజలు చేస్తున్న ఆందోళనలో అక్కడి పరిస్థితులతో అధికార పార్టీ నేతలు సైతం ఆందోళనలలో పాల్గొం టున్నారు. అయితే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలలో గ్రామాల విలీనంపై టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనల్లో పాల్గొనడం సీఎం ముందునుంచి సీరియస్‌గా పరిగణిస్తున్నారు. 

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటుపై త్వరలోనే ప్రకటన విడుదల కానున్న నేపథ్యంలో పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల ఏర్పాటు జరుగుతున్నదంటూ ముందునుంచి చెబుతున్న సీఎం అక్కడి పార్టీ నేతలకు, ప్రజా ప్రతినిధులకు పూర్తి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఏ పరిస్థితుల్లో జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామో.. కొంతమంది విపక్షాలు రాజకీయంగా లబ్ధిపొందేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఆందోళనలు నిర్వహిస్తున్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ముఖ్యమంత్రి వివరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదీ ఏమైనా జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు గ్రామాల విలీనం, మండలాల విలీనంపై పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని తీసుకొని కొద్దిగా మార్పులు చేర్పులు చేసి, వారిని బుజ్జగించనున్నట్లు సమాచారం. 

దీంతోనే కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో చర్చించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు జరగాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలోని నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని నిశ్చయించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు మెదక్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల నాయకులతో, సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, అదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ నాయకులతో ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారు. హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, డీసీఎంఎస్‌ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులను కోరారు. 

ఆదివారంనాడు సమీక్షించనున్న జిల్లాలుః
మహబూబ్‌నగర్‌ఉదయం 11.00గంటలకు, నల్గొండ మధ్యాహ్నం 12.00గంటలకు, రంగారెడ్డిమధ్యాహ్నం 1.00 గంటకు, నిజామాబాద్‌మధ్యాహ్నం 3.00 గంటలకు, మెదక్‌సాయంత్రం 4.00 గంటలకు, 

సోమవారం : కరీంనగర్‌ఉదయం 11.00 గంటలకు, వరంగల్‌మధ్యాహ్నం 12.00 గంటలకు, అదిలాబాద్‌మధ్యాహ్నం 1.00 గంటకు, ఖమ్మంమధ్యాహ్నం 3.00 గంటలకు హదరాబాద్‌సాయంత్రం 4.00 గంటలకు
suryaa.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com